: పార్లమెంట్ కు సమీపంలో ఉన్న వ్యభిచార గృహాలను మూసివేయాలంటున్న మహిళా కమిషన్
పార్లమెంట్ కు సమీపంలో ఉన్న వ్యభిచార గృహాలను మూసివేయాలని కోరుతూ వాటి నిర్వాహకులకు ఢిల్లీ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. అయితే, కొందరు నిర్వాహకులు సమన్లు తీసుకునేందుకు నిరాకరించడంతో వేశ్యాగృహాల గోడలకు వాటిని అంటించినట్టు మహిళా కమిషన్ సభ్యులు తెలిపారు. వేశ్యాగృహాల నిర్వాహకులను గుర్తించడం కమిషన్ కు చాలా కష్టమైందని ఈ సందర్భంగా వారు చెప్పారు. వేశ్యా గృహ నిర్వాహకులు తమ వ్యక్తిగత, నివాస ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 21 నుంచి 24 మధ్య తేదీల్లో కమిషన్ ముందుకు హాజరు కావాలని ఆదేశించినట్టు చెప్పారు.
ఈ సందర్భంగా ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ మాట్లాడుతూ, పార్లమెంట్ కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జీబీ రోడ్డులో వ్యభిచారం జరుగుతుండటం సిగ్గు చేటని, దీనిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి మైనర్ బాలికలు, యువతులు, మహిళలను ఈ వేశ్యా గృహాలకు అక్రమంగా తరలించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడి మహిళలపై కొన్ని సందర్భాల్లో దాడులు కూడా జరుగుతున్నాయని, నిజమైన యజమానులు బయట పడటం లేదని అన్నారు. అయితే, ఆయా సంఘటనల నేపథ్యంలో కొందరు నిర్వాహకులను మాత్రం పోలీసులు అరెస్టు చేశారని అన్నారు. కాగా, ఈ వేశ్యా గృహ నిర్వాహకులకు సమన్లు జారీ చేసేందుకు ఇటీవల ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఢిల్లీ మహిళా కమిషన్ లీగల్ కౌన్సిలర్ ప్రిన్సీ గోయెల్, మొబైల్ హెల్ప్ లైన్ కో-ఆర్డినేటర్ కిరణ్ నేగిల ఆధ్వర్యంలో ఈ కమిటీ పని చేస్తుంది.