: అభిమానులా? మజాకా... రాళ్లు, సోడా సీసాలతో దాడులు చేసుకున్న పవన్ కల్యాణ్, మహేశ్ బాబు అభిమానులు!
తెలుగు రాష్ట్రాల్లో సినీ అభిమానుల వ్యవహారశైలిపై ఎన్ని విమర్శలు రేగినా వారు తీరు మార్చుకోవడం లేదు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకున్న ఘర్షణ మరోసారి ఆందోళన కలిగిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలోని అనాతవరంలో మహేశ్ బాబు ఫ్యాన్స్ గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీని నిమజ్జనం సందర్భంగా జరిగిన ఊరేగింపులో బాణాసంచా కాల్చారు.
ఈ సందర్భంగా వదిలిన తారాజువ్వలు పవన్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ధ్వంసం చేయడంతో, ఆ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే అక్కడికి చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్ బాబు ఫ్యాన్స్ కూడా వాగ్వాదానికి దిగడంతో అది ముదిరింది. వెంటనే మరింతమంది అభిమానులు పోగయ్యారు. ఆ వాగ్వాదం వివాదంగా మారి, ఘర్షణకు కారణమైంది. ఇరు వర్గాలు రాళ్లు, సోడా సీసాలు విసురుకున్నారు. ఈ కొట్లాటలో పలువురు ఫ్యాన్స్ గాయాలపాలయ్యారు. గతంలో కూడా ఇలాంటి వివాదం రేగగా, గ్రామస్థులు కలుగచేసుకుని వివాదాన్ని సర్దుబాటు చేశారు. తాజా వివాదం ఘర్షణతో ముగిసింది.