: ఈ సోలార్ రైలును కాపాడడం మా వల్ల కాదు.. సెక్యూరిటీ పెంచండి.. ఆర్పీఎఫ్‌ను కోరిన రైల్వే శాఖ


భారతీయ రైల్వే ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన సోలార్ రైలు అధికారులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఈ రైలును కాపాడుకునేందుకు అదనపు భద్రత కావాలంటూ రైల్వే ప్రొటక్షన్‌ ఫోర్స్‌ను కోరింది. ఢిల్లీలోని సరాయ్ రోహిల్లా-హరియాణాలోని ఫరూఖ్ నగర్ మధ్య ఈ రైలును ప్రవేశపెట్టింది. ఇది పూర్తిగా సౌర విద్యుత్‌తో నడుస్తుంది. ఈ రైలు గ్రామీణ ప్రాంతాల నుంచి నడుస్తుండడంతో రైలు పైన బిగించిన సోలార్ ప్యానెల్స్‌‌ను కాపాడుకునేందుకు తమకు అదనపు భద్రత కావాలని కోరింది.

గ్రామీణులు వాటిని దొంగిలిస్తున్నారని, ఇలా అయితే రైలును నడపడం కష్టమవుతుందని, సోలార్ ప్యానెళ్ల రక్షణ కోసం తమకు అదనపు భద్రత అవసరమని ఉత్తర రైల్వే అధికారులు తెలిపారు. లెవల్ క్రాసింగుల వద్ద, సిగ్నళ్ల వద్ద తరచూ ఇవి చోరీకి గురవుతున్నాయని పేర్కొన్నారు. వీటిని ఎత్తుకెళ్తున్న గ్రామీణులు తమ ఇళ్లపై వీటిని అమర్చుకుని బల్బులు వెలిగించుకుంటున్నారని వివరించారు.

అదనపు భద్రత కావాలన్న రైల్వే అభ్యర్థనకు ఆర్పీఎఫ్ సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ రైలు ప్రయాణించే మొత్తం మార్గంలో వీటిపై నిఘా వేయడం కష్టమైన పనేనని, కాబట్టి రైల్వేనే ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే వీటిని దొంగిలించిన వారిని ఈజీగానే గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నట్టు చెప్పారు. బయట మార్కెట్లో దొరికే ప్యానెళ్లతో పోలిస్తే పరిమాణం, ఆకారం విషయంలో బయట దొరికే వాటికంటే భిన్నంగా ఉండడంతో దొంగిలించిన వారు దొరికిపోతున్నారని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News