: `దేవుళ్లు కూడా మేకప్ కోసం మా దగ్గరికే వస్తారు` అంటూ ప్రకటన ఇచ్చిన సెలూన్... క్షమాపణలు చెప్పిన అధినేత!
దేశంలోని వివిధ నగరాల్లో హెయిర్ కట్ సెలూన్ల శాఖలు ఏర్పాటు చేసిన జావేద్ హబీబ్ తమ ప్రకటనల కోసం హిందూ దేవుళ్లను వాడుకున్నాడు. `దేవుళ్లు కూడా తన సెలూన్‌కే వస్తారు` అంటూ వార్తాపత్రికల్లో ప్రకటన ఇచ్చాడు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. సెలూన్ ప్రచారం కోసం ఇంత స్థాయికి దిగజారడం సబబు కాదని, దేవుళ్లను కించపరిచేలా ప్రకటన ఉందని వివిధ రకాలుగా జావీద్ హబీబ్‌ను తూర్పారబట్టారు.
అంతేకాకుండా ఇక నుంచి జావీద్ హబీబ్ సెలూన్‌కి వెళ్లబోయేది లేదని కొంతమంది పేర్కొన్నారు. దీంతో ఆందోళనకు గురైన జావీద్ హబీబ్ ట్విట్టర్ ద్వారా క్షమాపణలు తెలియజేశాడు. తన అనుమతి లేకుండానే కోల్‌కతాలోని తమ శాఖ ఈ ప్రకటన వేయించిందని, ఈ ప్రకటన వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతీసి ఉంటే క్షమించాలని కోరాడు.