: స్నేహితురాలితో పాటు ఉంటూనే.. ఆమెకి టోపీ పెట్టేసింది!
స్నేహితురాలితో కలిసి ఉంటూనే ఆమెకు టోపీ పెట్టేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరులోని కేఆర్ పురం పరిధిలోని సీగేహళ్లిలో నివాసముండే కౌసల్య (35), రేణుక స్నేహితులు. రేణుకకు సంబంధించిన 7.38 లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు సిండికేట్ బ్యాంక్ లాకర్ లో పెట్టేందుకు వీరు బయల్దేరారు. మార్గమధ్యంలో ఒక ఫోటో స్టూడియోకు వెళ్లారు. స్టూడియో నుంచి బయటకు వచ్చిన వారికి వారు పార్క్ చేసిన వాహనం కనిపించలేదు. దీంతో వారు మల్లేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఇంతలో పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో వారి వాహనం కనిపించింది. దీంతో ఊపిరిపీల్చుకున్న వారిద్దరూ వాహనం డిక్కీ తెరిచి చూశారు. అందులో ఉండాల్సిన 257 గ్రాముల బంగారు ఆభరణాలు, 383 గ్రాముల వెండి వస్తువులు కనిపించలేదు.
దీంతో తమ ఆభరణాలు పోయాయంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. వారిద్దరూ వచ్చిన మార్గంలో ఉండే సీసీ పుటేజ్ ను పరిశీలించారు. స్టూడియో బయట ఉన్న సీసీ పుటేజ్ లో ఇద్దరు స్నేహితురాళ్లు కలిసి వెళ్లగా, మధ్యలో కౌసల్య బయటకు వచ్చి, ఒక యువకుడితో మాట్లాడింది. ఆ తరువాత అతను వాహనాన్ని తీసుకుని వెళ్లడం చూశారు. దీంతో ఆమెను నిలదీయగా, తనతో మాట్లాడిన వ్యక్తి సుదర్శన్ అని, అతని సహకారంతోనే నగలు దొంగిలించానని తెలిపింది. దీంతో ఆమె నుంచి 7.38 లక్షల రూపాయల విలువైన 257 గ్రాముల బంగారు ఆభరణాలు, 383 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను రిమాండ్ కు తరలించారు. సుదర్శన్ కోసం గాలింపు చేపట్టారు.