: ఈ కారణం వల్లే తమ్ముడు నన్ను జనసేనలోకి పిలవడం లేదు: నాగబాబు
గతంలో తాను నిర్మించిన 'ఆరెంజ్' సినిమా వల్ల చాలా నష్టపోయానని... అప్పుడు తమ్ముడు పవన్ కల్యాణ్ తనకు సపోర్ట్ ను ఇచ్చినప్పటికీ, ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలనే బాధతో చాలా కాలం గడిపానని నాగబాబు అన్నారు. బుల్లితెర సహాయంతోనే తాను పరిస్థితులను అధిగమించానని చెప్పారు. జనసేనలో పనిచేయాలని తమ్ముడు కోరుకుంటే, తాను పార్టీలో చేరడానికి సిద్ధమేనని తెలిపారు. అందరిలా తాను పార్టీలో చేరడానికి తాను పబ్లిక్ కాదని... పవన్ కు తాను అన్నయ్యనని చెప్పారు.
పవన్ పిలిస్తే ఓ కార్యకర్తలా పని చేయడానికి తాను సిద్ధమని అన్నారు. పవన్ తనను పార్టీలోకి ఆహ్వానించకపోవడానికి కారణం... జీవితంలో తాను పడిన కష్టాలేనని చెప్పారు. ఇకపై తాను ఎలాంటి కష్టాలు పడకూడదనే ఆలోచనతోనే పవన్ తనను పార్టీలోకి పిలవలేదని తెలిపారు. జనసేనలో చేరడం వల్ల పవన్ కు తాను ప్లస్ కాకున్నా పర్వాలేదు కానీ... మైనస్ మాత్రం కాకూడదని చెప్పారు. పవన్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. ఓ వార్తా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు ఈ మేరకు స్పందించారు.