: 132 మంది ఎయిరిండియా పైలట్లకు ఝలక్.. ఆల్కహాల్ టెస్ట్‌ను ఇక తప్పించుకోలేరు!

ఏదో వంకతో ఫ్లైట్ ఆల్కహాల్ టెస్ట్‌ నుంచి తప్పించుకుంటున్న ఎయిరిండియా పైలట్లు, సిబ్బందికి యాజమాన్యం షాకిచ్చింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశాల మేరకు ఎయిరిండియా అంతర్జాతీయ సర్వీసుల్లో పనిచేస్తున్న మొత్తం 130 మంది పైలట్లు, 430 మంది కేబిన్ సిబ్బంది ఇలా ఈ టెస్టు నుంచి తప్పించుకుంటున్నట్టు తేలింది. సింగపూర్, కువైట్, బ్యాంకాక్, అహ్మదాబాద్, గోవా రూట్లలో వెళ్తున్న కేబిన్ క్రూ వివిధ కారణాలతో బ్రీత్ అనలైజర్ టెస్ట్‌ నుంచి తప్పించుకుంటున్నారు. దీనిపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎయిరిండియాకు ఈ విషయంలో అల్టిమేటం జారీ చేసింది. ఎట్టి పరిస్థితులలోను నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఆదేశించింది.  

డీజీసీఏ నిబంధనల ప్రకారం ఫ్లైట్ ఎక్కడానికి ముందు, తర్వాత సిబ్బంది ఆల్కహాల్ టెస్ట్‌కు హాజరు కావడం తప్పనిసరి. అయితే ఫ్లైట్‌ లో డ్యూటీ చేయడానికి నిర్దేశిత సమయానికి 12 గంటల ముందు నుంచి ఆల్కహాల్ తీసుకోకూడదు. కాగా, 132 మంది పైలట్లు, 434 మంది సిబ్బంది తరచూ ఈ టెస్ట్ నుంచి తప్పించుకు తిరుగుతున్న విషయాన్ని డీజీసీఏ ఎయిరిండియా దృష్టికి తీసుకొచ్చింది. దీంతో ఈ విషయంలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఎయిరిండియా నిర్ణయించింది. కాగా, ఈ ఫిబ్రవరిలో బ్రీత్ అనలైజర్ టెస్ట్‌ నుంచి తప్పించుకున్న ఎయిరిండియా అప్పటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్వింద్ కఠ్‌పాలియా ఫ్లైయింగ్ లైసెన్స్‌ను డీజీసీఏ మూడు నెలల పాటు రద్దు చేసింది.

More Telugu News