: మోదీపై మహారాష్ట్ర బీజేపీ ఎంపీ ధిక్కార స్వరం.. తనను నోర్మూసుకోమన్నారని ఆరోపణ!
ప్రధాని నరేంద్రమోదీపై తొలిసారి మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ నానా ఫల్గుణరావు పటోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ సభలో ఆయన మాట్లాడుతూ.. మోదీకి ఎదురు ప్రశ్నలంటే గిట్టదని, తాను మహారాష్ట్రలోని రైతుల ఆత్మహత్యల గురించి ప్రస్తావించినప్పుడు ప్రధాని తనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని, నోర్మూసుకో అన్నారని ఆరోపించారు. పార్టీ మేనిఫెస్టో చదివారా? అని ప్రశ్నించారని అన్నారు. తాను ఇచ్చిన సలహాలపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. ప్రశ్నలు వేస్తే మోదీ సహించలేరని అన్నారు.
హరిత పన్ను వేయాలని, ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలని, వ్యవసాయంలో కేంద్ర పెట్టుబడులు పెంచాలని తాను సలహా ఇవ్వగానే మోదీకి కోపం వచ్చిందన్నారు. కేంద్ర మంత్రులకు కూడా మోదీ అంటే భయమేనని, తనకు మంత్రి పదవి ఇచ్చినా వద్దనే చెబుతానని, ఇటువంటి వాతావరణంలో తాను పనిచేయలేనని పటోలో తేల్చి చెప్పారు. మోదీ హిట్ లిస్ట్‌లో తొలి పేరు తనదేనని, అయితే తాను ఎవరికీ భయపడే రకం కాదని అన్నారు. అయితే ఆ తర్వాత మాత్రం పటోలే మాట మార్చారు. మీడియానే ఈ విషయాన్ని పెద్దది చేసి చూపిస్తోందంటూ దానిపైకి నెట్టేశారు.