: త్వరలో రైళ్లకు ప్రముఖ నవలల పేర్లు... యోచిస్తోన్న రైల్వే మంత్రిత్వ శాఖ
దేశంలోని వివిధ ప్రాంతాలను ఏకం చేసే రైళ్లకు కొత్త హంగులు దిద్దడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు వినూత్న విధానాలు చేపడుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాల గుండా ప్రయాణించే రైళ్లకు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రచయితలు రాసిన నవలల పేర్లు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్ వెళ్లే రైలుకు బెంగాలీ రచయితలు రాసిన ప్రముఖ నవల పేరు పెట్టవచ్చని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
ఇందుకోసం అవార్డులు గెల్చుకున్న వివిధ రచయితల నవలల జాబితాను రైల్వే శాఖ సిద్ధం చేస్తోందని ఆయన చెప్పారు. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఈ ఆలోచనకు ప్రాణం పోసినట్లు అధికారి తెలియజేశారు. మే 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక కొన్ని రైళ్లు, స్టేషన్లు, పథకాల పేర్లను మార్చిన సంగతి తెలిసిందే. రైల్వేలో ఇప్పటికే కొన్ని రైళ్లకు సాహిత్యానికి సంబంధించిన పేర్లు ఉన్నాయి. ఉదాహరణకు ముంబై నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్లే గోదాన్ ఎక్స్‌ప్రెస్, ప్రముఖ రచయిత మున్షీద్ ప్రేమ్‌చంద్ రాసిన నవల ఆధారంగా పెట్టినదే. అలాగే కైఫీయత్ ఎక్స్‌ప్రెస్ కూడా. ఇది ఉర్దూ కవి కైఫీ అజ్మీ స్వస్థలం యూపీలోని ఆజంఘర్ గుండా ఢిల్లీ వెళ్తుంది.