: అబ్దుల్ కలాంలాగే రామ్‌నాథ్ కోవింద్ జీవితం విద్యార్థులకు ఆదర్శం: చంద్రబాబు
తాను చదువుకున్న ఎస్వీ యూనివర్సిటీకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రావడం తనకు ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఎస్వీ ఆర్ట్స్ మైదానంలో ఏపీ ప్రభుత్వం రామ్‌నాథ్ కోవింద్ కు పౌర సన్మానం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంలాగే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జీవితం విద్యార్థులకు ఆదర్శమని అన్నారు.
ఓ పేద కుటుంబంలో పుట్టిన రామ్‌నాథ్ కోవింద్ ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇప్పుడు అత్యున్నత పదవిని అలంకరించారని చంద్రబాబు అన్నారు. ఒక సాధారణ మనిషిని దేశ అత్యున్నత పదవిలో నిలబెట్టడం ప్రజాస్వామ్య దేశ ప్రత్యేకత అని చెప్పారు. దేశానికి రాష్ట్రపతి అయినా ఆయన ఎంతో వినమ్రతతో ఉంటారని చంద్రబాబు అన్నారు. కొంతమంది వ్యక్తులు ఏ పదవి అలంకరించినా ఆ పదవికి వన్నె తెస్తారని, అందులో రామ్‌నాథ్ కోవింద్ ఒకరని అన్నారు.