: అనుమానాలకు తావిచ్చిన బిపాసా బసు చర్య!
ప్రముఖ బాలీవుడ్ నటి బిపాసా బసు తన సహనటుడు కరణ్ సింగ్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ వారి వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో, ఓ వార్త సంచలనంగా మారింది. బిపాసా బసు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని... ఆ సర్జరీ ఫెయిల్ అయిందనేదే ఆ వార్త.
దీనికి ఒక కారణం కూడా ఉంది. గత ఆదివారం రాత్రి బిపాసా, కరణ్ లు డిజైనర్ అయిన తమ స్నేహితుడు రాకీ ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత వారు కారులో తిరిగి వస్తుండగా పాపరాజ్జీలు వారివెంట పడ్డారు. వీరి ఫొటో తీయబోగా బిపాసా తన ముఖాన్ని కప్పుకుంది. ఏ ఒక్క ఫొటోలో కూడా ఆమె ముఖం కనిపించలేదు. ఇక్కడే వదంతులు ప్రారంభమయ్యాయి. బిప్స్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని, అది ఫెయిల్ అయిదంటూ పుకార్లు వెల్లువెత్తాయి. అయితే, కొన్ని గంటల క్రితమే ముంబై ఎయిర్ పోర్టు వద్ద బిపాసాను ఫొటో తీశారు. ఈ సందర్భంగా బిపాసాకు ఎలాంటి సర్జరీ జరగలేదనే విషయం తెలిసింది. ఫొటోగ్రాఫర్ల నుంచి తప్పించుకునేందుకే ఆదివారంనాడు ఆమె తన ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుందనే విషయం స్పష్టమైంది.