: 8 ఏళ్లలో నాలుగు రకాల కేన్సర్‌లు... పోరాడి గెల్చిన సుభాష్ అగర్వాల్!
బ్రతకాలన్న ఆశ, ఆత్మ విశ్వాసం వుంటే ఎలాంటి భయంకరమైన వ్యాధినైనా గెలవచ్చని ఉత్తర ప్రదేశ్‌కి చెందిన 65 ఏళ్ల సుభాష్ అగర్వాల్ నిరూపించాడు. గడచిన 8 ఏళ్లలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు రకాల కేన్సర్ వ్యాధులపై పోరాడి ఆయన విజయం సాధించాడు. 2009 నుంచి సుభాష్ నాలుగు సార్లు కేన్సర్ బారిన పడ్డాడు. మొదట పెద్దప్రేగు కేన్సర్, తర్వాత కనుగుడ్డుకి, చిన్నప్రేగుకి, ఎడమ మూత్రపిండానికి కేన్సర్ సోకింది. జీవితం మీద సుభాష్ ఎప్పుడూ ఆశని వదులుకోకపోవడంతో ఆయన శరీరం చికిత్సకు సహకరించింది.
`కేన్సర్ వ్యాధిగ్రస్తులందరూ చికిత్స విధానాలను తట్టుకోలేరు. కొంతమంది మాత్రమే కేన్సర్‌కి వ్యతిరేకంగా పోరాడగలరు. సుభాష్ ఆత్మస్థైర్యం, నమ్మకం, అతని కుటుంబం ఇచ్చిన అండ, ఆశల కారణంగానే నాలుగు సార్లు విజయం సాధించగలిగాడు` అని అతనికి చికిత్స చేసిన డాక్టర్లు చెబుతున్నారు. జీవితం మీద ఆశ ఉండి, బతుకుతామనే నమ్మకం ఉంటే ఎలాంటి రోగాన్నైనా జయించవచ్చని సుభాష్ చెప్పాడు.