: కోర్టుకు రాకుండా ఉండేందుకే పాదయాత్ర!: జగన్ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు


"కోర్టుకు హాజరు కాకుండా ఉండటానికే వైఎస్ జగన్ మినహాయింపు కోరుతున్నట్టు ఉంది. హాజరు మినహాయింపును ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసే అవకాశాలను కొట్టి వేయలేము. ఆయనపై తీవ్ర ఆర్థిక నేరారోపణలు ఉన్నాయి. నాలుగేళ్ల తరువాత పాదయాత్ర అనే కారణంతో రావడానికి ఇదే కారణమేమో" అంటూ వైసీపీ అధినేత జగన్ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తాను పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకోవాల్సి వుందని చెబుతూ, అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ వైకాపా అధినేత వైఎస్ జగన్, హైకోర్టును కోరిన వేళ న్యాయమూర్తి చేసి వ్యాఖ్యలివి.

మినహాయింపును కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చిన హైకోర్టు, శుక్రవారం నాడు రాలేకపోతే, అందుకు కారణాలను వెల్లడిస్తూ, కింది కోర్టులోనే అనుమతి పొందవచ్చని, అది ఆ కోర్టు విచక్షణపైనే ఆధారపడి వుంటుందని తేల్చి చెప్పింది. నేర తీవ్రత తక్కువగా ఉన్న కేసుల్లోనే నిందితుడికి మినహాయింపు ఇవ్వవచ్చని చట్టం చెబుతోందని, ఎక్కువ కాలం శిక్ష పడే అవకాశమున్న కేసుల్లో ఇటువంటి సౌలభ్యాలు లభించవని న్యాయమూర్తి ఎం.సత్యనారాయణమూర్తి తీర్పిచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ఈ తరహా కేసుల్లో నిందితులకు మినహాయింపులుండవని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News