: మీరు పొగ తాగుతారా?.. మరెందుకలా మాట్లాడుతున్నారు?: టీవీ 9 యాంకర్ ను ప్రశ్నించిన ‘అర్జున్ రెడ్డి’ హీరో
అర్జున్ రెడ్డి సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ తన సినిమాలోని వివాదాస్పద సన్నివేశాలను సమర్థించుకుంటున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాలో ఎన్నో బూతు డైలాగులు, లిప్ లాక్ సీన్లు ఉన్నాయని, పొగతాగడం వంటివి చూపించారని వీటి నుంచి ఏం నేర్చుకోవాలని టీవీ 9 యాంకర్ ప్రశ్నించింది.
దీనికి విజయ్ స్పందిస్తూ ‘మీ ఫోకస్ ఈ సినిమాలోని ఆ సీన్లపైనే ఉంది.. మీ పర్సనల్ ఒపీనియన్ అది.. మీరు పొగతాగుతారా?’ అంటూ యాంకర్ ను ప్రశ్నించాడు. ఈ హఠాత్పరిణామానికి కంగు తిన్న యాంకర్ తేరుకుని, తాను పొగతాగనని చెప్పింది. తర్వాత మళ్లీ ప్రశ్నిస్తూ, మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఇతర సినిమాలు కూడా ఇటువంటి పోస్టర్లే పెడితే పరిస్థితి ఏంటని యాంకర్ ప్రశ్నించింది. అలా చేస్తే ఆ సినిమా తీసేవారిదే తప్పవుతుందని అన్నాడు.
‘మీరు 90 శాతం ఫోకస్ ఈ సినిమాలోని అటువంటి డైలాగులపైనే పెట్టారు కాబట్టి ఇలా అడుగుతున్నారు.. మీకు నచ్చలేదని ఆ సీన్లు తీసేయడం కుదరదు.. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ సినిమాలో అర్జున్ రెడ్డి అనే వ్యక్తి క్యారెక్టర్ అదే.. అతను అలాగే ప్రవర్తిస్తాడు’ అని చెప్పుకొచ్చాడు. సినిమాలో చూపించారు కాబట్టి ప్రజలు వాటిని అనుకరిస్తారని అనుకుంటే పొరపాటే అని అన్నాడు. రెండు సినిమాలు హిట్ కాగానే మీకు పొగరు వచ్చేసిిందని కొందరు అనుకుంటున్నారని యాంకర్ అనగా... అనుకునే వారు అనుకుంటూనే ఉంటారని, తాను మాత్రం కరెక్టుగానే ఉన్నానని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు.