: ఏకంగా ప్రశ్నాపత్రాన్నే అమ్మేసిన ప్రొఫెసర్?...ఏపీపీఎస్సీ విచారణ
ఏపీపీఎస్సీలో నిర్వహించిన పరీక్షాపత్రాన్ని దానిని తయారు చేసిన ఆచార్యుడే విద్యార్థులకు విక్రయించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)లో 21 పోస్టుల భర్తీకి ఆరు నెలల కిందట అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్టు ఉద్యోగాల భర్తీకి పరీక్ష నిర్వహించారు. దీని ప్రశ్నాపత్ర తయారీ బాధ్యతలు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని జియాలజీ విభాగానికి అప్పగించారు.
గత ఫిబ్రవరిలో ఈ పరీక్షను నిర్వహించగా, ఫలితాలను ఏప్రిల్లో విడుదల చేశారు. మేలో ఇంటర్వ్యూలు నిర్వహించి, జూన్ లో నియామకాలు జరిపారు. అయితే ఇందులో ఏయూ జియాలజీ విభాగంలో పీహెచ్డీ చేస్తున్న ఇద్దరు విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చాయి. వీరిలో ఒకరు ఈ పరీక్షాపత్రాన్ని రూపొందించిన ప్రొఫెసర్ వద్ద స్కాలర్. వీరికి ఇతర అభ్యర్థుల కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. దీంతో ఈ పరీక్ష రాసిన వారు ఏపీపీఎస్సీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది.