: ఉద్యమంలో చురుగ్గా ఉన్నా పదవి దక్కలేదని.. నిప్పంటించుకున్న టీఆర్ఎస్ నేత.. పరిస్థితి విషమం!


పార్టీలో క్రియాశీలకంగా ఉన్నా పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన టీఆర్ఎస్ నేత ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అది కూడా మంత్రి మందే ఈ ఘటనకు పాల్పడడం సంచలనం రేకెత్తిస్తోంది. వికారాబాద్ జిల్లా తాండూరులోని ఓ ఫంక్షన్ హాలులో పట్టణ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి మహేందర్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
 
కార్యక్రమం జరుగుతుండగా పట్టణ మాజీ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్ వేదిక పైకెక్కి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు పార్టీలో చురుగ్గా ఉంటున్నాని ఆయన పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నానని తెలిపారు. అయినా ఇప్పటి వరకు తనకు ఎటువంటి నామినేటెడ్ పదవి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. అధిష్ఠానానికి  పలుమార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బయటకు వెళ్లి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. మంటలతోనే తిరిగి సమావేశ ప్రాంగణానికి వచ్చారు. అప్రమత్తమైన కార్యకర్తలు, పోలీసులు మంటలను ఆర్పివేశారు. తీవ్ర గాయాలపాలైన అయూబ్‌ఖాన్‌ను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఘటన అనంతరం కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న మంత్రి హైదరాబాద్ వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News