: సిమ్లా గ్యాంగ్ రేప్ కేసు: ఐజీ, డీఎస్పీ సహా 8 మంది పోలీసులు కటకటాల్లోకి!
జూలై 4న హిమాచల్‌ప్రదేశ్, సిమ్లా జిల్లాలోని కోట్‌ఖైలో స్కూలు విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో సీబీఐ అధికారులు 8 మంది పోలీసులను అరెస్ట్ చేశారు. వీరిలో ఐజీ, డీఎస్పీ కూడా ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కస్టడీలో ఉండగానే మరణించడం (కస్టోడియల్ డెత్) తో వీరిని అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. సీనియర్ ఐపీఎస్ అధికారి జహూర్ జైదీ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ జోషీలను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
రేప్ కేసులో ప్రధాన నిందితుడైన నేపాల్ కార్మికుడు సూరజ్ సింగ్ కోట్‌ఖై పోలీస్ స్టేషన్ లాకప్‌లో జూలై 18న మృతి చెందాడు. మరో నిందితుడు రాజేందర్ సింగ్ ను తీవ్రంగా కొట్టి హత్య చేసినట్టు ఆరోపణలున్నాయి. బాలికపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో పోలీసులు ఆరుగురుని అదుపులోకి తీసుకోగా వారిలో రాజేందర్ సింగ్, సూరజ్ సింగ్ కూడా ఉన్నారు.
జూలై 4న బాలికపై అత్యాచారం జరగ్గా 6న తీవ్ర గాయాలతో అడవిలో పడి ఉన్న బాలికను గుర్తించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో సిమ్లా వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. దీంతో కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిన ప్రభుత్వం జైదీకి సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఈ కేసును సిట్‌కు బదిలీ చేయడానికి ముందు జోషి విచారించారు. కాగా, కస్టడీలో ఉన్న నిందితుడు చనిపోవడంతో సీబీఐ జైదీ, జోషీ సహా ఎనిమిది మందిని పోలీసులను మంగళవారం అరెస్ట్ చేసింది.