: ఈ హెడ్ మాస్టర్ మాకొద్దు... నిత్యం వేధింపులు భరించలేకపోతున్నాం: 50 మంది విద్యార్థినుల ఫిర్యాదు
హెడ్ మాస్టర్ పై 50 మంది స్కూలు విద్యార్థినులు ఎంఈవోకు ఫిర్యాదు చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియా మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... నిన్న పాఠశాలలో ఒక కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఎంఈవో తరి రాములు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒక్కసారిగా ఎంఈవోను చుట్టుముట్టిన 50 మంది విద్యార్థినులు ‘‘ఈ సారు మాకొద్దు.. ఆయన పెట్టే లైంగిక వేధింపులు భరించలేక మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది’’ అంటూ హెడ్ మాస్టర్ గుండా కృష్ణమూర్తిపై ఫిర్యాదు చేశారు.
గత కొంత కాలంగా ఆయన తమను లైంగికంగా వేధిస్తున్నాడని వారు పేర్కొన్నారు. వెంటనే అతనిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందించగా, ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఉన్నతాధికారులకు ఎంఈవో సమాచారం అందించారు. దీనిపై హెడ్ మాస్టర్ గుండా కృష్ణమూర్తి వివరణ ఇస్తూ, పాఠశాలలో టీచర్ల మధ్య ఐక్యత కొరవడిందని, టీచర్లే తనపై నిందలు వేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులు క్రమశిక్షణగా ఉండాలని చెప్పడం నేరమైపోయిందని ఆయన తెలిపారు.