: వారికి సలాం...డేరా బాబాకి ఈ శిక్ష చాలదు: నిర్భయ తల్లి
దేశంలో ఏ ఇద్దరిని కదిపినా...గుర్మీత్ రాం రహీం సింగ్ బాబా గురించిన మాటలే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్భయ తల్లి ఆశాదేవి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాం రహీంకు శిక్ష విధించినందుకు ఆనందంగా ఉందని అన్నారు. అయితే ఈ శిక్ష అతనికి సరిపోదని ఆమె స్పష్టం చేశారు. 20 ఏళ్ల జైలు శిక్ష కంటే కఠినమైన శిక్ష విధించి ఉండాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ 15 ఏళ్లలో గుర్మీత్ రామ్ రహీం అకృత్యానికి బలైపోయిన బాధిత మహిళలు ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటారు? ఎన్ని అవమానాలు పడి ఉంటారు? ఎన్ని వేధింపులకు గురై ఉంటారు? అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు అనుభవించిన క్షోభతో పోలిస్తే గుర్మీత్ రాం రహీంకు ఈ శిక్ష సరిపోదని ఆమె అన్నారు. అయితే అతనికి ఈ శిక్ష పడేలా చేసిన వారందరికీ సలాం చేయాలని ఆమె తెలిపారు. 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసిన ఇద్దరు మహిళలను అభినందించాలని ఆమె సూచించారు.