: డేరా సచ్ఛా సౌధాలో ప్రత్యేక నగదు వ్యవస్థ... ప్లాస్టిక్ నాణెలు, టోకెన్ల చలామణి
బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అనుచరులు సిర్సాలోని డేరా సచ్ఛా సౌధా ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక నగదు వ్యవస్థను రూపొందించుకున్నారు. ఇక్కడి క్యాంపస్‌లోని దుకాణాలు, కార్యాలయాల్లో చిల్లర కొరతను తగ్గించేందుకు వారు ప్రత్యేక నగదును సృష్టించుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ రూ.10, రూ.5ల ప్లాస్టిక్ కాయిన్లు, టోకెన్లను వినియోగదారులకు అందజేస్తారు. ఈ టోకెన్లు, నాణెలపై `ధన్ ధన్ సద్గురు తేరాహీ ఆసరా.. డేరా సచ్చా సౌధా, సిర్సా` అని ముద్రించి ఉంటుంది. వీటిని 800 ఎకరాల విశాల ప్రాంగణంలో ఉన్న అన్ని దుకాణాల్లో చలామణి చేయొచ్చు. అలాగని భారత కరెన్సీ చెల్లవని కాదు. వినియోగదారులు ఇచ్చిన సొమ్ముకు సరైన చిల్లర లేకపోతే మిగిలిన డబ్బు స్థానంలో ఈ టోకెన్లను అందజేస్తారు. డేరా చీఫ్ గుర్మీత్ అరెస్టు నేపథ్యంలో వార్తలు అందించడానికి అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులకు భారత కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్ కాయిన్స్ ఇవ్వడం గమనార్హం.