: పవనిజం అంటే ఉద్యమమా? ఉన్మాదమా? అని పరిశోధన చేశాను: మహేశ్ కత్తి సంచలన వ్యాఖ్యలు
జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ రాసిన ఇజం పుస్తకాన్ని తాను ఎంతో కష్టపడి సంపాదించి, పూర్తిగా చదివానని సినీ విశ్లేషకుడు మహేశ్ కత్తి అన్నాడు. అందులో పవన్ కల్యాణ్ రాసిన విషయాలు ఓ ఐదవ తరగతి విద్యార్థి కూడా రాయగలడని విమర్శించాడు. ఈ రోజు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తాను ఇజం పుస్తకాన్ని చదివినప్పటినుంచి తనకు పవన్ కల్యాణ్ తీరుపై ఆసక్తి కలిగిందని అన్నారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చెప్పుకుంటున్న పవనిజం ఉద్యమమా? ఉన్మాదమా? అనే విషయంపై పరిశోధన చేశానని వ్యాఖ్యానించాడు.
పవన్ కల్యాణ్ తికమక పడుతూ ఆయన అభిమానులను, ప్రజలను తికమక పెడుతున్నారని తనకు తెలిసిందని మహేశ్ కత్తి చెప్పాడు. ఓ మూర్ఖత్వాన్ని ఆయన అభిమానులు నెత్తిన వేసుకుని తిరుగుతున్నారని విమర్శించాడు. తన సేఫ్టీ తనకి ముఖ్యం కాబట్టి సమాజంలో జరుగుతున్న పలు విషయాలను పవన్ కల్యాణ్ ప్రశ్నించడం లేదని, ఖండించడం లేదని అన్నాడు. తనకు రాజకీయాలపై అవగాహన ఉందని మహేశ్ కత్తి అన్నాడు.
తనతో ఎవరో ఇలా మాట్లాడిస్తున్నారని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారని ఆయన వాపోయాడు. తాను కూడా అటువంటి ప్రశ్నలు వేయగలనని చెప్పాడు. సేవలు చేయడం కోసం పార్టీ పెట్టానని చెప్పుకుంటున్న పవన్ కల్యాణ్ ఇంతవరకు ఏం సేవ చేశారని ప్రశ్నించాడు. పవన్ కల్యాణ్ తన దగ్గర డబ్బులులేవని అంటున్నాడని, పబ్లిక్ పంక్షన్స్ పెట్టడానికి డబ్బులెలా వచ్చాయని ఆయన అడిగాడు. పవన్ రాజకీయ పార్టీ నడిపించడానికి డబ్బులు ఎవరు ఇచ్చారని ప్రశ్నించాడు. ఆయన వెనుక ఎవరైనా ఉన్నారా? అని అన్నాడు.