: పవన్ కల్యాణ్ కిడ్నీ బాధితుల సమస్యలను చెబితే సానుకూలంగా స్పందించాను.. కానీ జగన్ అలా కాదు!: చంద్రబాబు
ప్రతిపక్ష నాయకుడంటే జగన్మోహన్ రెడ్డిలా ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన కాకినాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ... జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కిడ్నీ బాధితుల సమస్యలను చెబితే సానుకూలంగా స్పందించానని అన్నారు. కానీ జగన్ మాత్రం సమస్యలను తమ దృష్టికి తీసుకురాకుండా గందరగోళం సృష్టిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. తనని నడిరోడ్డుపై కాల్చేయాలంటున్నాడని, ఉరేస్తానంటున్నాడని అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా ప్రశాంతతకు, శాంతికి మారుపేరని, జగన్ లాంటి వారిని గెలిపిస్తే అందుకు భంగం కలుగుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అభివృద్ధి, సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పాటుపడుతోందని చెప్పారు. రౌడీయిజం, గూండాయిజానికి ఎక్కడా చోటు ఉండకూడదని అన్నారు. వైసీపీ నేతలు ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ఆ పార్టీ రాష్ట్రాభివృద్ధికి అడ్డంకిలా తయారైందని విమర్శించారు. వైసీపీని చిత్తుగా ఓడించాలని, డిపాజిట్లు కూడా రాకుండా చూడాలని కోరారు.