: ఇన్ఫోసిస్‌కు ఎస్‌బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య?
అక్టోబర్ 6న పదవీ విరమణ చేయనున్న ఎస్‌బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్యకు ఇన్ఫోసిస్ నుంచి తమ బోర్డులో చేరాలని ఆహ్వానం వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మాజీ సీఈఓ విశాల్ సిక్కా రాజీనామా చేయడానికి పది రోజుల ముందే ఆమెకు ఈ మేరకు ఈ-మెయిల్ వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అరుంధతీ నుంచి ఎలాంటి స్పందన రాలేదని సమాచారం. అలాగే మరో ఐటీ కంపెనీ నుంచి ఆమెకు ఆఫర్ అందినట్లు తెలుస్తోంది.
తాను పదవీ విరమణ చేసిన కొన్ని నెలలకు ఇన్ఫోసిస్‌లో చేరేందుకే అరుంధతీ మొగ్గు చూపుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వోద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత కొంత విరామం తీసుకున్నాకే వేరే ప్రైవేటు ఉద్యోగంలో చేరాలి. దీంతో కొన్నినెలలు ఆమె విరామం తీసుకోవచ్చని వారు చెబుతున్నారు. ఒకవేళ ఆమె ఇన్ఫోసిస్ బోర్డులో చేరితే ఇప్పటికే ఉన్న కిరణ్ మజుందార్ షా, పుణీతా కుమార్ సిన్హా, రూపా కుద్వాల సరసన కంపెనీ బోర్డులో పనిచేసే నాలుగో మహిళ అవుతారు.