: సుష్మా స్వరాజ్ అతిధి సత్కారం... నేపాల్ ప్రధానికి మంచినీళ్లు అందించిన విదేశాంగ మంత్రి
భారత పర్యటనకు వచ్చిన నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దూబకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ భారత అతిధి మర్యాదలు ఎలా ఉంటాయో తెలియజేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతుండగా పులమారి, దగ్గుతుండటంతో సుష్మా గ్లాసుతో మంచి నీళ్లను అందించారు. ఇరు దేశాల ప్రధానులు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రసంగించారు. నేపాల్ ప్రధాని మాట్లాడుతుండగా గొంతు పులమారింది. దీంతో తీవ్రంగా దగ్గడం మొదలు పెట్టారు.
వెంటనే సభలో ముందు వరుసలో కూర్చున్న సుష్మా స్వరాజ్ ఓ గ్లాసుతో ఆయనకు మంచి నీళ్లు అందించారు. అవి తాగిన దూబ తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగించారు. మళ్లీ ఆయన దగ్గర్నుంచి గ్లాసు తిరిగి తీసుకోవడానికి సుష్మా స్వరాజ్ పోడియం దగ్గర నిల్చునే ఉన్నారు. ఈలోగా గ్లాసు తీసుకోవడానికి ఓ అధికారి రావడంతో సుష్మా కూర్చున్నారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కేవలం ట్విట్టర్‌లోనే కాదు, అన్ని చోట్లలో వెంటనే స్పందిస్తారని మరోసారి నిరూపించారు.