: టీమిండియాకు ముచ్చెమటలు పట్టించిన ధనంజయ.. భువీ బ్యాట్ అడ్డం పెట్టకుంటే..?


పల్లెకెలెలో ఆతిథ్య శ్రీలంకతో గురువారం జరిగిన రెండో వన్డేలో శ్రీలంక యువకెరటం అకిల ధనంజయ టీమిండియాకు ముచ్చెమటలు పట్టించాడు. అతడి దెబ్బకు జట్టు విజయం బాట నుంచి ఓటమి బాటలోకి పయనించింది. ఆ సమయంలో ధోనీ సీనియారిటీ, బౌలర్ భువనేశ్వర్ కుమార్ సంయమనం జట్టును ఒడ్డుకు చేర్చాయి. లేదంటే సిరీస్ 1-1తో సమమయ్యేదే. శ్రీలంక 237 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ ముందుంచగా, వర్షం కారణంగా లక్ష్యాన్ని 47 ఓవర్లలో 231 పరుగులకు కుదించారు.

లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ దూకుడు చూసిన ప్రేక్షకులు వారిద్దరే మ్యాచ్‌ను ముగించేస్తారని భావించారు. వికెట్ నష్టపోకుండా 109 పరుగులు చేసి విజయం దిశగా దూసుకుపోతున్న భారత్‌ను శ్రీలంక యువ బౌలర్ ధనంజయ ఘోరంగా దెబ్బకొట్టాడు. 15వ ఓవర్ మూడో బంతికి రోహిత్‌శర్మ (54)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న ధనంజయ అనంతరం భారత్‌ను తన బౌలింగ్‌తో భయపెట్టాడు. వరుసపెట్టి వికెట్లు తీస్తూ టీమిండియా గుండెల్లో గుబులు పుట్టించాడు.

ధనంజయ దెబ్బకు 22 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రాహుల్ (4), జాదవ్ (1), కోహ్లీ (4), పాండ్యా (0), అక్షర్ (6)లను పెవిలియన్ చేర్చి తానెంత ప్రమాదకారో తేల్చి చెప్పాడు. అతడి బంతులను అంచనా వేయడంలో విఫలమైన బ్యాట్స్‌మెన్ వికెట్లను సమర్పించుకున్నారు. ఒక దశలో భారత్ ఓటమి ఖాయమని తేలిపోయింది. అయితే మాజీ సారథి ధోనీ (45), భువనేశ్వర్ కుమార్ (53) సమయోచితంగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. 54 పరుగులిచ్చి 6 వికెట్లు నేలకూల్చిన ధనంజయకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

  • Loading...

More Telugu News