: పోలీసులే దొంగలైన వేళ.. టోల్ ప్లాజాను దోచుకున్న ఆరుగురు పోలీసులు!
పోలీసులే దోపిడీ దొంగలుగా మారారు. జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజాపై పడి సిబ్బందిని చితకబాది అందినంత దోచుకున్నారు. ఆగ్రా-ఢిల్లీ జాతీయ రహదారి2పై ఈ ఘటన జరిగింది. దోపిడీ దొంగల్లా మారిన ఆరుగురు పోలీసులపై మధుర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల్లో ఒక సర్కిల్ ఆఫీసర్ కూడా ఉండడం గమనార్హం. సర్కిల్ ఆఫీసర్ నితిన్ సింగ్ సహా ఆరుగురు పోలీసులు ఆగస్టు 22-23 రాత్రి టోల్‌ప్లాజాలోకి చొరబడి సిబ్బందిని కొట్టి రూ.40 వేల నగదు దోచుకెళ్లారని ప్లాజా అసిస్టెంట్ మేనేజర్ ఓపీ యాదవ్ తెలిపారు. పోలీసుల దోపిడీ, దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఫిర్యాదుతోపాటు పోలీసులకు అందజేసినట్టు తెలిపారు.
అయితే, ఈ కేసులో పోలీసుల వాదన మరోలా వుంది. తాము గస్తీ డ్యూటీలో వుండగా ముగ్గురు వ్యక్తులు వచ్చి, టోల్ ప్లాజా సిబ్బంది అధిక మొత్తంలో ఫీజు తీసుకుంటున్నారని తమకు ఫిర్యాదు చేశారని, దాంతో ప్లాజా మేనేజర్ సహా సిబ్బంది 25 మందిపై కేసు నమోదు చేశామని సర్కిల్ ఆఫీసర్ నితిన్ సింగ్ పేర్కొన్నారు. తమపై ప్లాజా సిబ్బంది చేసిన ఆరోపణలను ఆయన కొట్టిపడేశారు.