: వన్డే కెప్టెన్సీకి స్టార్ ఆటగాడు ఏబీ డివిల్లీర్స్ గుడ్‌బై.. టెస్ట్ కెరీర్‌పై క్లారిటీ!
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిల్లీర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే జట్టు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేశాడు. ఆరేళ్ల నుంచి వన్డే జట్టుకు కెప్టెన్సీ వహిస్తుండడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొన్న డివిల్లీర్స్ జట్టును వేరేవారు నడిపించే సమయం ఆసన్నమైందన్నాడు. కొత్త కెప్టెన్‌కు తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నాడు. పనిలోపనిగా తన టెస్ట్ క్రికెట్ కెరీర్‌పై వస్తున్న పుకార్లకు తెరదించాడు.
అన్ని ఫార్మాట్లలోనూ కొనసాగుతానని, వన్డే కెప్టెన్సీ నుంచి మాత్రమే తప్పుకుంటున్నట్టు స్పష్టత ఇచ్చాడు. గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ అనంతరం టెస్టులకు దూరంగా ఉండడంతో పుకార్లు చక్కర్లు కొట్టాయి. డివిల్లీర్స్ టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్టు వార్తలు వినిపించాయి. దీంతో తాజాగా తన టెస్ట్ క్రికెట్‌పై క్లారిటీ ఇచ్చేశాడు.