: పోలింగ్ శాతం తగ్గించడానికి వైసీపీ యత్నించింది: మంత్రి అఖిలప్రియ ఆరోపణ
ఈ రోజు జరిగిన నంద్యాల ఉపఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గించడానికి వైసీపీ యత్నించిందని మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. ఈ రోజు సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారని అన్నారు. నిన్న ఎన్నికల ప్రచార సమయం ముగియగానే తాము నంద్యాల వదిలి వెళ్లిపోయామని, తాము ప్రచారం చేయకున్నా చేసినట్టుగా సాక్షి ఛానెల్ లో చూపించారని, ప్రచార సమయం ముగిసిన తర్వాత కూడా వైసీపీ నేత చక్రపాణిరెడ్డి నంద్యాలలోనే ఉన్నారని ఆరోపించారు.
శిల్పా సోదరులను ప్రజలు పట్టించుకోలేదని, తనది కర్నూలు జిల్లా అని, వారిది ఈ జిల్లానే కాదని అన్నారు. భూమా కుటుంబానికి అండగా ఉన్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, నంద్యాల టీడీపీ నేతలంతా బాగా కష్టపడ్డారని ఆమె ప్రశంసించారు. ఈ ఉపఎన్నికల్లో టీడీపీకి మంచి మెజార్టీ రావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్ పై ఆలస్యంగానైనా ఎన్నికల కమిషన్ స్పందించడం సంతోషకరమని, రోజా వ్యాఖ్యలను తాము సీరియస్ గా తీసుకోలేదని చెప్పారు. తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టే సంస్కృతి తమది కాదని అఖిలప్రియ అన్నారు.