: పార్టీ మారనున్నట్టు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ మంత్రి కామినేని
బీజేపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరతారని తనపై వస్తున్న వార్తా కథనాలపై ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. ఈ ప్రచారమంతా అవాస్తవమని, ప్రాణాలున్నంత వరకూ బీజేపీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. తనకు ఈ స్థాయిని అందించింది బీజేపీయేనని, వెంకయ్యనాయుడి అడుగుజాడల్లో తాను ఎదిగానని అన్నారు. ప్రజలిచ్చిన ఐదేళ్ల అధికార కాలాన్ని సేవ చేసేందుకే వినియోగించుకుంటానని తెలిపారు. తాను అందరితో కలిసే వుంటానని, తనకు ఎవరూ శత్రువులు లేరని స్పష్టం చేశారు. 26న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెలగపూడికి వచ్చి, నూతన ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వెంకయ్యకు ఘన సన్మానం చేయనున్నట్టు తెలిపారు.