: అమెరికాకు దడ పుట్టిస్తున్న ఐక్యరాజ్యసమితి నివేదిక... ఉత్తర కొరియా చేతిలో రసాయన ఆయుధాలు
ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన 37 పేజీల నివేదిక అమెరికా గుండెల్లో గుబులు రేపుతోంది. ఇంతకీ ఈ నివేదికలో ఏముందంటే... ఉత్తర కొరియా రసాయన ఆయుధాలను తయారు చేసుకుంది. ఉత్తర కొరియా ఎగుమతులపై ఐక్యరాజ్యసమితి అంక్షలు విధించిన అనంతరం సిరియా నుంచి ఆ దేశం రెండు పడవల్లో రసాయన దాడులకు అవసరమైన సామాగ్రిని దిగుమతి చేసుకుందని ఐక్యరాజ్యసమితి అంతరంగిక భద్రతా మండలి తన నివేదికలో వెల్లడించింది. దానికి తగిన ఆధారాలను కూడా చూపుతోంది.
సిరియా నుంచి ఈ రసాయనాలను ఉత్తర కొరియా మైనింగ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పేరుతో రప్పించుకుందని తెలిపింది. ఈ సంస్థ లావాదేవీలను 2009లోనే ఐక్యరాజ్యసమితి నిషేధించింది. 2013లో రష్యా, అమెరికాలు రసాయన ఆయుధాలను తయారు చేయకుండా చూడాలని సిరియాకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. వాటిని ఉల్లంఘిస్తూ సిరియా రసాయన ఆయుధాలను తయారు చేసి, ఐసిస్ తీవ్రవాదులపై ప్రయోగించగా, అవి సాధారణ ప్రజలపై ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. రసాయన ఆయుధాలు మానవాళికి ముప్పు కలిగిస్తాయని, అలాంటి ఆయుధాలను తయారు చేయవద్దని ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.