: పునర్విభజన చట్టం ఆధారంగానే తెలుగు రాష్ట్రాలు నీటిని పంచుకోవాలి: కృష్ణానదీ యాజమాన్య బోర్డు
రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న వాటాల ఆధారంగానే రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణా నది నీటిని పంచుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. విజయవాడలోని గేట్ వే హోటల్ లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆరవ సర్వసభ్య సమావేశం ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా బోర్డు చైర్మన్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, కృష్ణానది నీటి వినియోగం విషయంలో ఎగువ రాష్ట్రాలతో పాటు దిగువ రాష్ట్రాలూ సమాన భాగస్వాములేననే విషయాన్ని గుర్తించాలని అన్నారు. నీటి పంపకాలు, వివాదాలపై అపెక్స్ కమిటీని ఏర్పాటు చేయాలని రెండు తెలుగు రాష్ట్రాలూ ఇప్పటికే లేఖలు రాశాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు.
కర్ణాటక ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉందని, దిగువ రాష్ట్రాలకు నీటిని విడుదల చేయాల్సిందిగా కేంద్రానికి, బజాజ్ కమిటీకి లేఖ రాయాలని భావిస్తున్నట్టు శ్రీవాత్సవ తెలిపారు. నీటి పంపకాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య స్వల్ప భేదాభిప్రాయాలు ఉన్నాయని అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటిని ప్రోరేటా ఆధారంగానే రెండు రాష్ట్రాలు పంచుకోవాలని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల దిగువన తొలి దశలో 18 టెలీమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేశామని, రెండో దశలో మరో 29 స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. కార్యదర్శి సమీర్ ఛటర్జీ మాట్లాడుతూ, హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 400 క్యూసెక్కుల నీటిని తెలంగాణ రాష్ట్రం వాడుకుంటోందని అన్నారు. అయితే, సమాచారం లోపం కారణంగా, కొన్నిసార్లు నీటి విడుదలలో ఏర్పడుతున్న జాప్యం కారణంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని అన్నారు.