: నెల్లూరులో టీడీపీకి చెందిన నలుగురు బుకీలు ఉన్నారు: విచారణకు హాజరైన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో వైసీపీ నేతల పేర్లు బయటకు రావడంతో నెల్లూరు, కాకినాడల్లో అలజడి రేగుతోంది. ఈ కేసులో కాకినాడలోనూ 16 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌లను నెల్లూరులో పోలీసులు విచారించారు. అనంతరం అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ... ఈ కేసులో ఏ విచారణకైనా తాను సిద్ధమేనని అన్నారు. ఈ నెల 27న పోలీసులు మరోసారి విచారణకు రమ్మన్నారని అన్నారు.
తన బ్యాంకు ఖాతా లావాదేవీలపై పోలీసులు ప్రశ్నించారని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఆధారాలు ఉంటే తనను ఏమైనా చేసుకోవచ్చని అన్నారు. నెల్లూరులో టీడీపీకి చెందిన నలుగురు బుకీలు ఉన్నారని, సూళ్లూరుపేటలో వైసీపీకి చెందిన ఓ వ్యక్తి బుకీగా ఉన్నాడని వ్యాఖ్యానించారు. తమ పార్టీకి సంబంధించిన బుకీలు నెల్లూరులో లేరని , బాధితులు మాత్రమే ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తమ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రభుత్వంలో ఉండే పెద్దలు ప్రయత్నాలు చేస్తే తాము సహించబోమని అన్నారు. ఈ కేసులో తాను విచారణకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు.