: రూ.50 తక్కువగా ఉన్నాయని స్కానింగ్ చేయని సిబ్బంది.. చిన్నారి మృతి
మానవత్వం మాయమైపోతోందని కవులు చెబుతున్న మాటలు అక్షర సత్యాలనిపించేలా మరో ఘటన చోటు చేసుకుంది. జార్ఖండ్‌లో ఓ చిన్నారికి స్కానింగ్ తీయిద్దామని వెళ్లిన తల్లిదండ్రుల వద్ద రూ.50 తక్కువగా ఉన్నాయి. ఆ యాభై రూపాయలు తరువాత చెల్లించుకుంటామని వారు ఆసుపత్రి సిబ్బందిని బతిమిలాడుకున్నారు. అయినా ఒప్పుకోని ఆ సిబ్బంది పూర్తిగా డబ్బులిస్తేనే స్కానింగ్ తీస్తామని చెప్పేశారు. దీంతో ఆ చిన్నారికి వైద్యం చేయించడం ఆలస్యమై తల్లిఒడిలోనే ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే, రాంచీలో నివసించే సంతోష్ కుమార్ దంపతులకు శ్యాం అనే ఓ చిన్నారి ఉన్నాడు. ఆ చిన్నారి ఆడుకుంటూ కింద పడటంతో తలకు గాయమైంది.
దీంతో తమ కుమారుడిని సంతోష్ రిమ్స్ (రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్)కి తీసుకెళ్లగా, వైద్యులు సీటీ స్కాన్ తీయించుకుని రమ్మన్నారు. అందుకోసం రూ.1350 ఖర్చు అవుతుంది. కానీ ఆ తండ్రి వద్ద రూ.1300 మాత్రమే ఉన్నాయి. దీంతో అక్కడి సిబ్బంది స్కానింగ్ తీయబోమని తెగేసి చెప్పారు. సంతోష్ తన స్నేహితుడికి ఫోన్ చేసి డబ్బులు తీసుకురమ్మన్నాడు. అయితే, ఆయన వచ్చేలోపే ఆ చిన్నారి మృత్యు ఒడిని చేరాడు.