: నాకు హిందీ అర్థం కాదు: కేంద్రమంత్రి లేఖకు ఒడియాలో ఎంపీ సమాధానం
హిందీయేతర రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం బలవంతంగా హిందీని రుద్దడాన్ని ఒడిశాకు చెందిన బిజు జనతాదళ్ నాయకుడు, ఎంపీ తథాగత సత్పతి మరోసారి తెరమీదకు తీసుకొచ్చారు. `ఇండియా 2022` కార్యక్రమానికి ఆహ్వానిస్తూ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ హిందీలో రాసిన లేఖకు ఆయన `నాకు హిందీ అర్థం కాదు` అంటూ ఒడియాలో లేఖ రాసి పంపారు. ఈ రెండు లేఖలను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు.
`హిందీయేతరులపై హిందీ భాషను బలవంతంగా రుద్దడానికి కేంద్ర మంత్రులు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఇది ఇతర భాషల మీద దాడి కాదా?` అని తథాగత ట్వీట్ చేశారు. అలాగే కేంద్రమంత్రి రాసిన లేఖ అర్థంకావడం లేదని ఒడియాలో లేఖ రాసినట్లు ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఒడిశా సీ కేటగిరీ రాష్ట్రం కావడంతో లేఖను ఒడియాలో గానీ, ఇంగ్లిషులో గానీ రాయాలని తథాగత కోరారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ - `నాకు అన్ని భాషల మీద గౌరవం ఉంది. కానీ ఒడియా, బెంగాలీతో పాటు ఇతర భాషలు కూడా సుందరమైనవేనని వాళ్లు గుర్తుంచుకోవాలి` అన్నారు.