: గ్రేట్ వాల్‌పై కెమెరాలు ఏర్పాటు చేసిన చైనా... పేర్లు రాస్తున్న పర్యాటకులపై నిఘా!
ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన చైనాలోని గ్రేట్ వాల్‌పై పేర్లు రాస్తూ, జ్ఞాపకం కోసం చిన్న చిన్న రాళ్లను పెకిలించి తమ దేశాలకు తీసుకెళ్తున్న పర్యాటకులను అరికట్టడానికి 300కు పైగా హై డెఫినిషన్ కెమెరాలను గ్రేట్ వాల్ పొడవునా అమర్చారు. చారిత్రక కట్టడానికి నష్టం తెస్తున్న వారిని గుర్తించడానికే చైనా ప్రభుత్వం ఈ పని చేసినట్టు మీడియా అభిప్రాయపడింది. గ్రేట్ వాల్ పొడవునా చాలా చోట్ల కొరియన్, చైనీస్, ఇంగ్లిషు పేర్లతో ఉండటాన్ని ఇటీవల చైనా పురాతన కట్టడాల బృందం గమనించింది. వారి సలహా మేరకు, ఇక నుంచి ఇలాంటి పనులు జరగకుండా ఉండేందుకు చైనా కెమెరాలను ఏర్పాటు చేసింది. ఎవరైనా పర్యాటకులు పేర్లు గానీ, గీతలు గానీ చెక్కుతున్నట్లు కనిపిస్తే, వారిని మళ్లీ చైనాకు రాకుండా నిషేధించాలని ప్రభుత్వం నిశ్చయించుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఎప్పటికప్పుడు పర్యాటకులను పర్యవేక్షించడానికి గోడపై ప్రత్యేక పోలీసు బృందాలను, హెచ్చరిక బోర్డులను కూడా అమర్చినట్లు మీడియా పేర్కొంది.