: స్మార్ట్‌ఫోన్ కోసం పందెం కట్టిన యువకుడు.. నదిలోకి దూకి ప్రాణాలు కోల్పోయాడు!... వీడియో చూడండి
ప్రవహిస్తున్న నదిని ఈత కొడుతూ దాటితే రూ. 15000లతో పాటు స్మార్ట్‌ఫోన్ కూడా ఇస్తామని స్నేహితులు పందెం కాయడంతో నదిలోకి దూకి ప్రాణాలు కోల్పోయాడు ఓ పాకిస్థానీ యువకుడు. పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో గుజ్రాన్‌వాలా ప్రాంతానికి చెందిన అలీ అబ్రార్, పందెం విషయంలో స్నేహితులు బలవంతం చేయడంతో జోరుగా ప్రవహిస్తున్న జీలం నదిని ఈదడానికి ప్రయత్నించి నదిలో కొట్టుకుపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్‌లో ఉంది.
ఇందులో నదిలో దూకడానికి ముందు అలీకి, తన స్నేహితులకు మధ్య ఏదో సంభాషణ జరుగుతుండటం చూడొచ్చు. తర్వాత నీళ్లలోకి దూకిన అలీ ప్రవాహ ధాటికి కొట్టుకుపోవడం కూడా చూడొచ్చు. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో అలీ మృతదేహం ఇంకా లభించేదని పోలీసులు తెలిపారు. ఈ కేసులో అలీ స్నేహితులు ఒసామా, తల్హా, జెషన్, షోయబ్, రాహత్‌లను అదుపులోకి తీసుకున్నట్లు వారు చెప్పారు. గతంలో కూడా ఈ ప్రదేశంలో ఐదుగురు టూరిస్టులు నదిలో కొట్టుకుపోయినా, ఇక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు పెట్టలేదని స్థానికులు వెల్లడించారు.