: సంక్లిష్ట శస్త్రచికిత్సలను సులభంగా పూర్తిచేసే రోబో!
హెర్నియా సరిచేయడం, పురీషనాళం, పాయువు, పెద్దప్రేగు, ప్రొస్టేట్, చెవి, ముక్కు, గొంతు వంటి సంక్లిష్ట శస్త్రచికిత్సలు సులభంగా చేయగల రోబోను లండన్ శాస్త్రవేత్తలు రూపొందించారు. మొబైల్‌ఫోన్లు, అంతరిక్ష కేంద్రంలో వాడే సాంకేతికతను ఉపయోగించి తయారు చేసిన ఈ రోబో పేరు `వెర్సైస్`. ప్రపంచంలో శస్త్రచికిత్సలు చేయగల రోబోల్లో వెర్సైస్ అతిచిన్నది.
మనిషి చేతిని పోలి ఉండే ఈ రోబో సహాయంతో సంప్రదాయ శస్త్రచికిత్సల్లోలాగా పెద్ద పెద్ద గాట్లు పెట్టనవసరం లేకుండానే శస్త్రచికిత్స చేయవచ్చు. దీంతో రక్తస్రావం తక్కువగా జరగడమే కాకుండా రోగికి పెద్దగా బాధ కూడా తెలియదని శాస్త్రవేత్తలు తెలిపారు. త్రీడీ తెర సాయంతో ఈ రోబోను నియంత్రించవచ్చు. వచ్చే ఏడాది లాంఛనంగా ప్రారంభించే ఈ రోబోను ముందుగా లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స చేసేందుకు ఉపయోగించనున్నట్లు కేంబ్రిడ్జ్ మెడికల్ రోబోటిక్స్ శాస్త్రవేత్త మార్టిన్ ఫ్రోస్ట్ చెప్పారు.