: రంగంలోకి దిగుతున్న 'డ్రాగన్ లేడీ'... చీమ చిటుక్కుమన్నా అమెరికా సైన్యానికి తెలిసిపోతుంది!
అమెరికా, ఉత్తరకొరియా మధ్య యుద్ధ వాతావరణం ఇంకా చల్లబడలేదు. అమెరికాపై ఇప్పుడే దాడి చేయడం లేదని ఉత్తర కొరియా ప్రకటించినప్పటికీ, ఆ మాటల్ని అమెరికా పూర్తిగా విశ్వసించడం లేదు. అందుకే, తన జాగ్రత్తలో తానుంటోంది. శత్రు దేశం కదలికలపై ఓ కన్నేసి ఉంచింది. ఈ క్రమంలో అమెరికా సైన్యం తన అత్యాధునిక యుద్ధ విమానం 'డ్రాగన్ లేడీ'ని రంగంలోకి దించింది. ఉత్తరకొరియా రాడార్లు కనిపెట్టలేనంత ఎత్తులో అంటే సుమారు 70 వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ అది పహారా కాస్తుంది. నేటి సాయంత్రం అది జపాన్ ఎయిర్ బేస్ నుంచి బయల్దేరనుందని అమెరికా సైన్యం తెలిపింది.
చాలా ఎత్తులో ఈ విమానాన్ని నడపవలసి ఉండడంతో ఇందులోని పైలెట్లు వ్యోమగాములు ధిరించేటటువంటి దుస్తులను ధరిస్తారని అమెరికా సైన్యాధికారులు తెలిపారు. అంతర్జాతీయ ఒత్తిడితోనే ఉత్తర కొరియా దాడిని వాయిదా వేసిందని, దాడిని రద్దు చేసుకోలేదని అమెరికా సైన్యం అనుమానిస్తోంది. దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించే సమయంలో ఉత్తరకొరియా తీవ్రంగా స్పందించే అవకాశం ఉందని, దీంతో అది తీవ్ర నిర్ణయం తీసుకుంటే ముందుగానే గుర్తు పట్టాల్సిన బాధ్యత తమపై ఉందని అమెరికా సైన్యం చెబుతోంది. అందుకే ముందు జాగ్రత్తగా ఉత్తరకొరియాపై నిఘా కోసం అత్యంత శక్తిమంతమైన కెమెరాలతో పహారా కాసేందుకు డ్రాగన్ లేడీని రంగంలోకి దించామని తెలిపింది.