: నంద్యాలలో టీడీపీ ఓడిపోతే చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవు: వైసీపీ నేత కొడాలి నాని
నంద్యాల ఉపఎన్నికలో కనుక టీడీపీ ఓడిపోతే చంద్రబాబుకు, ఆయన పార్టీకి, ప్రభుత్వానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'చంద్రబాబు నాయుడేమి చిన్నపిల్లాడు కాదు, చంటిపిల్లాడు కాదు.. నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. నంద్యాల నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు ఆయనకు పూర్తిగా తెలుసు' అన్నారు. అందుకే, ధనబలాన్ని, కండబలాన్ని,అధికార బలాన్ని ఉపయోగించుకుని అవసరమైతే రిగ్గింగ్ చేసి అయినా సరే, ఇక్కడ గెలవాలని చంద్రబాబు చూస్తున్నారని నాని ఆరోపించారు.
‘2004లో ఈ ప్రాంతంలో శిల్పా మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. చంద్రబాబునాయుడు ఇప్పుడు వచ్చి నేనేదో పగలదీస్తున్నాను ఈ మూడున్నర సంవత్సరాల నుంచి అని చెబుతున్నాడు. గతంలో శిల్పా మోహన్ రెడ్డి గారు మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏమాత్రం అభివృద్ది పనులు చేయలేదని చెబుతున్న చంద్రబాబును నేను ఒకటే అడుగుతున్నాను. అంతకుముందు పది సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు, మంత్రి ఫరూక్ ఏం చేశారు? గుడ్డి గుర్రానికి పళ్లు తోమారా?’ అంటూ నాని మండిపడ్డారు.