: భారత ఐటీకి గడ్డుకాలం: ఫారిన్ మీడియా


భారత ఐటీ ఇండస్ట్రీ గత ఏడేళ్లలో ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితుల్లో ఉందని విదేశీ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ దశాబ్దం ప్రారంభానికి ముందు ఏర్పడిన ప్రపంచ ఆర్థికమాంద్యం నుంచి కోలుకుని శరవేగంగా వృద్ధి దిశగా సాగిన ఐటీ కంపెనీలు, ఇప్పుడు తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయాయని, ఇన్ఫోసిస్ లో ఎండీ విశాల్ సిక్కా రాజీనామా వ్యవహారం, ఇతర కంపెనీల్లోనూ ప్రకంపనలు సృష్టించిందని ప్రపంచ వార్తా సంస్థ 'బ్లూమ్ బర్గ్' వెల్లడించింది.

ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఉద్యోగ సృష్టి కూడా మందగించిందని పేర్కొంది. కరెంటు ఖాతాల లోటు 2013 తరువాత అత్యధిక స్థాయిలో ఉందని, దీని కారణంగా రూపాయి మారకపు విలువపై ఒత్తిడి పెరుగుతోందని అభిప్రాయపడింది. దీని ప్రభావంతో ఎంతో మంది ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది.

అందివచ్చిన అవకాశాలతో ఈ దశాబ్దం ప్రారంభం నుంచి విస్తరణ బాటలో దూసుకెళ్లిన భారత కంపెనీలకు అమెరికా అధ్యక్ష ఎన్నికలు, బ్రెగ్జిట్ తదితరాలు ప్రభావాన్ని చూపాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. 2014లో మోదీ కీలక హామీల్లో ఒకటైన ఉద్యోగ సృష్టి, 2019 ఎన్నికల్లో కీలకాంశం కానుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం, ఇండియాలో సాలీనా 1.75 లక్షల నుంచి 2 లక్షల వరకూ ఐటీ సెక్టార్ లో ఉద్యోగాలు పోనున్నాయని వెల్లడైంది. 2020 వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని కూడా వరల్డ్ బ్యాంక్ హెచ్చరించింది. నాస్కామ్ అంచనాల ప్రకారమూ భారత ఐటీ కంపెనీల్లో నూతన ఉద్యోగాల ఇస్తుండటం క్రమంగా తగ్గుతోందని వెల్లడైంది.

  • Loading...

More Telugu News