: సీఎం చంద్రబాబు ప్యాంట్రీ వాహనంలో డబ్బు తరలిస్తున్నారంటూ పుకార్లు.. చెక్ చేసి, ఏమీ లేదని వదిలేసిన ఈసీ పరిశీలకులు!
నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు నిర్వహించనున్న రోడ్ షోలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ప్యాంట్రీ వాహనం విజయవాడ నుంచి నంద్యాలకు ఈ రోజు రాత్రి బయలుదేరింది. అయితే, ఈ వాహనంలో కోట్లాది రూపాయలు తరలిస్తున్నారంటూ ఎన్నికల సంఘం అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో గాజులపల్లె మెట్ట శివార్లలో ఎన్నికల కమిషన్ పరిశీలకులు, పోలీసులు ఈ వాహనాన్ని అడ్డగించారు.
ఆర్టీసీ పేరుతో రిజిస్టర్ అయిన కంటైనర్ (నెంబర్ ఏపీ 16 జడ్ 0363) సీఎం ప్యాంట్రీ వాహనం అని అధికారులకు వాహనం డ్రైవర్ చెప్పాడు. అయితే, ఈ వాహనాన్ని అక్కడే తనిఖీ చేయాలని స్థానికులు పట్టుబట్టారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు అక్కడికి తరలివెళ్లారు. దీంతో, పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. కంటైనర్ ను తెరిచి తనిఖీ చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ వాహనాన్ని పరిశీలించగా అందులో కూరగాయలు, వంట సామగ్రి మాత్రమే ఉన్నట్టు ఈసీ పరిశీలకులు, పోలీసులు గుర్తించారు. దీంతో, ఈ వాహనాన్ని వదిలేశారు.