: నంద్యాలలో ఓటర్లను చంద్రబాబు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు: వైసీపీ నేత పార్థసారధి
నంద్యాల ఉపఎన్నికల్లో ఓటమి భయంతో టీడీపీ అక్కడి ప్రజలను హింసిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారధి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమ నేతలపై గ్రామాల్లో బైండోవర్ కేసులు పెడుతున్నారని అన్నారు. తమ పార్టీకి సహకరించినందుకు గానూ దళితుడు బాలస్వామి ఇంటిపై పోలీసులతో దాడి చేయించారని, మరికొందరిని కూడా బెదిరించారని ఆరోపించారు.
తమ కార్యకర్తలు ఉంటున్న ప్రాంతాల్లో వీధిదీపాలు వెలగకుండా చేస్తున్నారని అన్నారు. ఓటర్లను చంద్రబాబు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అయినా ఓటర్లు భయపడకూడదని, తాము అండగా ఉంటామని చెప్పారు. తన కేబినెట్‌లో ఒక్క ముస్లింకు కూడా స్థానం కల్పించని చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఉప ఎన్నిక నేపథ్యంలో మైనార్టీలను మచ్చిక చేసుకోవాలని చూస్తున్నారని అన్నారు.