: నంద్యాలలో డబ్బులు పంచిన వారిలో వైకాపా కార్యకర్తలు... స్టేషన్ కు వచ్చి వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
నంద్యాలలో డబ్బులు పంచుతూ పట్టుబడిన వారిలో కొందరు వైకాపా కార్యకర్తలు ఉండటంతో, ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, వారిని ఉంచిన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఖర్చుల నిమిత్తం వారు డబ్బును దగ్గరుంచుకుంటే, ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. మొత్తం 22 మందిని పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 4.30 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెబుతుండగా, వారు ఎవరన్న విషయాన్ని శ్రీకాంత్ రెడ్డి ఆరా తీశారు. వీరిలో నలుగురు మాత్రమే వైకాపా కార్యకర్తలు ఉన్నారని, వారు కూడా డబ్బులు పంచడం లేదని, వైకాపాకు ఓటు వేయాలని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుంటే అరెస్ట్ చేశారని ఆరోపించారు. నంద్యాలలో బస, భోజన ఖర్చుల నిమిత్తం వారి వద్ద కొంత డబ్బుంటే, దాన్ని గమనించకుండా అరెస్టులేంటని ప్రశ్నించారు.