: బార్సిలోనా ఉగ్రదాడి బాధితులలో భారతీయులెవరూ లేరు!: సుష్మాస్వరాజ్

స్పెయిన్ లోని బార్సిలోనాలోని రద్దీగా ఉండే లస్‌ రంబ్లస్‌ రహదారిలో ఐఎస్ఐఎస్ కు చెందిన ఉగ్రవాదులు వ్యాన్ తో ఢీకొట్టి హతమార్చిన దుర్ఘటనలో భారతీయులెవరూ మరణించడం కానీ, గాయపడడం కానీ లేదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటించారు. దీంతో స్పెయిన్ కు వెళ్లిన, స్పెయిన్ లో ఉంటున్న భారతీయుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు.

మరోపక్క, ఉగ్రదాడిపై డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిని తీవ్రంగా ఖండించారు. కాగా, స్పెయిన్ లో ఇది రెండో భారీ ఉగ్రదాడి అని రికార్డులు చెబుతున్నాయి. 2004 మార్చిలో స్పెయిన్‌ లోని మాడ్రిడ్‌ లో అల్‌ ఖైదా ప్రేరేపిత ఉగ్రవాదులు ప్రయాణికుల రైళ్లలో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 191 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్ లోని నీస్ లో జరిగిన దాడి తరహాలో జరిగిన ఈ దాడిలో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారికి చికిత్స అందిస్తున్నారు. నీస్ ఘటనలో 86 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

కాగా, ప్రాణాలు తీసేందుకు ఉగ్రవాదులు ఎంచుకున్న విధానంపై ఆందోళన వ్యక్తమవుతోంది. బాంబులు, మారణాయుధాలను గుర్తించే టెక్నాలజీ ఉందని, ఒక మనిషి వాహనం నడుపుతూ హతమార్చడానికి వస్తే గుర్తించడం కష్టమని భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News