: నిరాహారదీక్ష నేపథ్యంలో.. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అరెస్టు!
సంగారెడ్డి జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఏర్పాటు చేయాల్సిన మెడికల్ కాలేజీని సిద్ధిపేటకు తరలించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తాను ముందుగా ప్రకటించినట్లుగానే ఈ రోజు కలెక్టరేట్ ముందు ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించే ప్రయత్నం చేశారు. అయితే, ఆయన దీక్షకు దిగడానికి ముందు తన ఇంటినుంచి తమ పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. ఆయన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరిగి తోపులాట జరిగింది. జగ్గారెడ్డిని అరెస్టు చేసి, జోగిపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుండడంతో సంగారెడ్డిలో పోలీసులు భారీగా మోహరించారు.