: స్నేహితురాలి కోసం భారత్ నుంచి సరస్వతీదేవి విగ్రహాన్ని తీసుకెళ్లిన పాక్ ముస్లిం యువతి!
నెల రోజుల క్రితం పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చిన యువతి వెళ్తూ వెళ్తూ తన స్నేహితురాలి కోసం సరస్వతీదేవి విగ్రహాన్ని తీసుకెళ్లింది. కరాచీకి చెందిన తుబా ఫాతిమా (21) నెల రోజుల క్రితం మధ్యప్రదేశ్, హర్దా జిల్లాలోని తన మేనమామ ఇంటికి వచ్చింది. వచ్చేముందు పాక్‌లోని తన స్నేహితురాలు రీతును కలిసి ఆ విషయం చెప్పింది. అక్కడి నుంచి ఎటువంటి బహుమతి తీసుకురావాలని కోరగా, తనకు చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహం కావాలని చెప్పింది.
హర్దాలోని తన మేనమామ అహద్ ఖాన్ ఇంటికి వచ్చిన ఫాతిమా ఇటీవల తన స్నేహితురాలి కోరిక గురించి ఆయనకు చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి వెళ్లి సరస్వతీదేవి విగ్రహాన్ని కొనుగోలు చేశారు. బుధవారం ఫాతిమా తిరిగి కరాచీ బయలుదేరింది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రీతూ, తాను ఒకే కంపెనీలో పనిచేస్తున్నట్టు పేర్కొంది. రెండు కుటుంబాల మధ్య విడదీయరానంత సాన్నిహిత్యం ఉందని పేర్కొంది. గతేడాది తన తల్లి భారత్ వచ్చినప్పుడు రీతు కోసం గణేశుడి విగ్రహం తెచ్చిందని, ఇప్పుడు తాను సరస్వతీ దేవి విగ్రహాన్ని ఆమెకు బహుమానంగా ఇస్తున్నట్టు ఆనందంగా తెలిపింది.