: ‘టాయ్ లెట్ సినిమా ద్వారా ప్రభుత్వం గురించి ప్రచారం చేస్తున్నానని చాలా మంది నన్ను తప్పుబట్టారు!: నటుడు అక్షయ్ కుమార్
ఇటీవల విడుదలైన ‘టాయ్ లెట్: ఏక్ ప్రేమ్ కథా’ చిత్రం రూ.100 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర హీరో అక్షయ్ కుమార్ తన అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. ‘బహిర్భూమి’ అంశంతో తెరకెక్కించిన ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమైందనే విషయం అభిమానులకు కూడా తెలుసని, ఈ చిత్రం ఆడినా ఆడకపోయినా ప్రతి ఇంటికీ వెళ్లి ఈ చిత్రం ప్రాధాన్యత గురించి చెప్పేవాడినని అన్నాడు. అయితే, తన సినిమాను అభిమానులు ఎంతగా ఆదరించారంటే బాక్సాఫీస్ వద్ద తన పని తాను చేసుకుపోతోందని అన్నాడు.
కేవలం, బాక్సాఫీస్ వద్ద దూసుకుపోవడమే కాదు, ఇంతకంటే మరో ముఖ్యమైన పనిని కూడా ఈ చిత్రం చేస్తోందని, బహిర్భూమికి వెళ్లే వారికి దాని వల్ల కలిగే పరిణామాలను వివరిస్తోందని అన్నాడు. నెమ్మదిగా జనాల్లో మార్పు తెస్తున్న తన చిత్రంలో చక్కటి సందేశం ఉందన్నాడు. మొదట్లో ఈ సినిమా ద్వారా తాను ప్రభుత్వం గురించి ప్రచారం చేస్తున్నానని తనను తప్పుబట్టినవారే థియేటర్ లో తన సినిమా చూసి కేరింతలు కొడుతున్నారని, ఈలలు వేస్తున్నారని అన్నాడు.