: మోదీ ప్రభుత్వం వల్ల నేపాల్ కూడా మనకు దూరమైంది.. మరోవైపు శ్రీలంకలో చైనా పోర్ట్ నిర్మిస్తోంది: రాహుల్ గాంధీ
నిన్న ఎర్రకోట వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టే మోదీ తన ప్రసంగ సమయాన్ని తగ్గించారని ఆయన అన్నారు. ఈ రోజు బెంగళూరులో పర్యటించిన రాహుల్ ఓ సభలో మాట్లాడుతూ... దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగ సమస్య గురించి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ముందు చెప్పుకున్న మోదీ ఆ విషయంపై ఎందుకు మాట్లాడలేదని అన్నారు.
గోరఖ్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక మృతిచెందిన చిన్నారుల విషయంపై ఆయన ఎందుకు నోరువిప్పలేదని రాహుల్ అడిగారు. హెల్త్ బడ్జెట్‌ను మోదీ ప్రభుత్వం తగ్గించిందని రాహుల్ గాంధీ అన్నారు. అందుకే పిల్లలకు అవసరమయ్యే ఆక్సిజన్ ఆసుపత్రిలో లేదని ఆరోపించారు. విదేశాంగ విధానంలోనూ మోదీ ప్రభుత్వం ఎన్నో నష్టాలు తెచ్చిపెడుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. స్నేహపూర్వక దేశాలతో కూడా అనేక సమస్యలను తీసుకువచ్చిందని అన్నారు.
ఇంతకు ముందు భారత్‌కి పాకిస్థాన్, చైనాతో మాత్రమే సత్సంబంధాలు సరిగా ఉండకపోయేవని, మిగతా అన్ని దేశాలు మనతో స్నేహంగా ఉండేవని, ప్రస్తుతం నేపాల్ కూడా మనకు దూరమైందని, మరోవైపు శ్రీలంకలో చైనా పోర్ట్ నిర్మిస్తోందని ఆయన అన్నారు. మొదటిసారి రష్యాకు పాకిస్థాన్ ఆయుధాలు విక్రయిస్తోందని తెలిపారు. తాము అధికారంలో ఉన్నప్పుడు జమ్మూకశ్మీర్‌లో శాంతి స్థాపన కోసం పదేళ్లు కష్టపడ్డామని అన్నారు. మోదీ సర్కారు రాగానే ఒక్క నెలలోనే దాన్ని అంతా నాశనం చేసిందని విమర్శించారు.