: దళితులపై ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు!
‘దళితులు శుభ్రంగా ఉండరు.. సక్రమంగా చదువుకోరు.. వారు అభివృద్ధి చెందక పోవడానికి వారే కారణం’ అంటూ ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమవుతోంది. కడప జిల్లా జమ్మలమడుగు ఏరియా ఆసుపత్రి అభివృద్ధి అంశంపై చర్చించేందుకు ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లయినా దళితులు మారలేదు. రాజ్యాంగంలో అంబేద్కర్ దళితులకు పదేళ్లు మాత్రమే రిజర్వేషన్లు కల్పించారు. ఇప్పటికి 70 ఏళ్లు దాటినా వారిలో ఎటువంటి మార్పు రాలేదు. దళితులు అభివృద్ధి చెందకపోవడానికి దళితులే కారణం. వారి భూములకి పట్టాలు ఉండవు. వారు బాగా చదువుకోరు. శుభ్రంగా ఉండరు. అందుకే వారే ఎక్కువగా రోగాల బారిన పడుతున్నారు’ అంటూ దళితులను కించపరిచారు. నంద్యాల ఉపఎన్నికల తరువాత ఆసుపత్రి ఛైర్మన్ గా తన కుమారుడు సుధీర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తాడని ఆయన తెలిపారు. కాగా, ఆయన చేసిన వ్యాఖ్యలపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి.