: అమ్మాయిలను ఏడిపిస్తే తాటతీస్తా: రోమియోలకు చంద్రబాబు వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మాయిలను ఏడిపించే రోమియోల తాట తీస్తానని సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ, తిరుపతిలో ప్రసంగించిన ఆయన, బాలికా శిశు సంక్షేమం కోసం, వర్కింగ్ ఉమెన్స్, కాలేజీ విద్యార్థినుల కోసం తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదలకు చేయూతనిస్తున్నామని అన్నారు. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలన్నది తన లక్ష్యమని, ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎవరు ఎదురొడ్డినా రాయలసీమను రతనాల సీమగా మార్చి చూపిస్తానని ప్రతినబూనారు.
వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మరిన్ని పంట కుంటలతో పాటు ఇంకుడు గుంతలను ప్రజలు స్వచ్ఛందంగా తవ్వేలా చర్యలు చేపడతామని తెలిపారు. నీటిని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని, పంట సంజీవని కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ చెక్ డ్యామ్ లు, చెరువుల్లో పూడికతీత పనులు చేపడుతున్నామని గుర్తు చేశారు. రెండు ప్రధాన నదులుగా ఉన్న గోదావరి, కృష్ణాల అనుసంధానాన్ని పూర్తి చేశామని తెలిపారు. గోదావరిలో నీరు వృథాగా సముద్రంలో కలుస్తుంటే, కృష్ణాలో నీళ్లు రావడం లేదని, ఈ పరిస్థితిని నదుల అనుసంధానం మారుస్తుందని అభిప్రాయపడ్డారు.